ప్రభుత్వ పథకం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్..

ప్రభుత్వ పథకం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్.. 

  • రైతులకు వరంగా ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన 
  • యూనిట్ ధరలో 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం
  • రూ. లక్షన్నర ఆదాయం మించొద్దు 
  • కౌలు రైతులూ అర్హులే.. 
వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కొంతమంది బడా రైతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయంలో ప్రధానమైన ట్రాక్టర్ను కొనే స్థోమత లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయలేని రైతులకు ఈ పథకం వరంగా మారింది. 

50 శాతం చెల్లిస్తే ట్రాక్టర్ సొంతం.. 

రైతులు ట్రాక్టర్ ధరలో 50 శాతం చెల్లిస్తే చాలు ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద నచ్చిన ట్రాక్టర్ను సొంతం చేసుకోవచ్చు. అది కూడా భరించలేని రైతులు వ్యవసాయ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు. రైతు ఏ బ్యాంక్ లో లోన్ తీసుకుంటాడో అదే బ్యాంక్కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది. ట్రాక్టర్ ధర రూ.8లక్షలు అనుకుంటే రైతు రూ.4లక్షలు చెల్లించాలి. మిగతా రూ.4లక్షలను కేంద్రం భరిస్తుంది. లోన్ మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో బ్యాంకు చెల్లిస్తే సరిపోతుంది. 

రూ.లక్షన్నర ఆదాయం ఉన్నవారికే..  

ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించరాదు. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ సబ్సిడీపై ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులకు ఇది వర్తిస్తుంది. కౌలు రైతులు సైతం ఈ స్కీం ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. వీరు భూ యజమానుల దగ్గరి నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎనోవోసీ) తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఒక రైతు ఒక ట్రాక్టర్ను మాత్రమే కొనే వీలుంటుంది. తనకు నచ్చిన కంపెనీ, నచ్చిన మోడలు రైతులు ఎంపిక చేసుకోవచ్చు. ఏ ట్రాక్టర్ కొనుగోలు చేయాలన్నది పూర్తిగా రైతుల ఇష్టమే.

దరఖాస్తు చేయడం ఇలా.. 

ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకానికి రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో https://pmkisan.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఓటర్ ఐడీ లైసెన్స్, పాస్పోర్టుల్లో ఏదో ఒకటి కార్డు, డ్రైవింగ్ తప్పనిసరిగా సమర్పించాలి. వ్యవసాయ భూమికి సంబంధించిన అడంగల్ పహాణీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇన్కమ్ సర్టిఫికెట్, లేటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా అనుమానాలుంటే హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ 155261, 011–24300606 నంబర్లలో లేదా దగ్గరలోని ట్రాక్టర్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలి. 

ఇప్పటివరకు 15 ట్రాక్టర్లు ఇచ్చాం

ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన స్కీమ్ చిన్న, సన్నకారు రైతులకు ఎంతో లాభదాయకం. ఈ పథకం కింద ఇప్పటివరకు మేం 15 ట్రాక్టర్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.4లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ట్రాక్టర్ కొనుగోలు చేసిన తర్వాత మూడు నెలల్లోపు సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ ట్రాక్టర్ల షోరూమ్ తెలిపింది. 
Source v6velugu 

Post a Comment

0 Comments